శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా మండలిలో రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటన్నర పాటు సభలో వైకాపా ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పలుమార్లు ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో సభలో కొంతసేపు వాతావరణం వేడెక్కింది.
డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను మండలి ఛైర్మన్ మోషేనురాజు ప్రారంభించగానే కూటమి ఎమ్మెల్సీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో వైకాపా సభ్యులతో పాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గోపిమూర్తి, శ్రీనివాసులు నాయుడు మాత్రమే ఉన్నారు. డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైకాపా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఛైర్మన్ ప్రకటించారు.
అనంతరం మాధవరావును గౌరవపూర్వకంగా డిప్యూటీ ఛైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. వైకాపా ఎమ్మెల్సీలు ఆయనకు అభినందనలు తెలిపారు. మండలిలో సాంకేతికంగా వైకాపా సభ్యుడిగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్‌కు కూడా మాధవరావు అభినందనలు తెలిపే అవకాశం కల్పించారు.
డీఎస్సీపై చర్చకు అవకాశం ఇవ్వాలని గత మూడు రోజులుగా వైకాపా సభ్యులు సభలో ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశాన్ని డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా కూడా ప్రస్తావించారు. మాధవరావును అభినందిస్తూ మాట్లాడిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సుమారు 25 నిమిషాల పాటు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఎన్నిక కార్యక్రమం కంటే డీఎస్సీ అంశంపైనే చర్చ సాగింది.
డిప్యూటీ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపే సమయంలో వైకాపా సభ్యులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించడంపై సభలో చర్చ జరిగింది. అనంతరం వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, సభ్యుడు ఉపయోగించిన అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు.
డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా కూటమి ఎమ్మెల్సీలు సభ నుంచి వెళ్లిపోవడాన్ని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. చట్టసభలు ఏర్పడిన తర్వాత ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సరికాదన్నారు. రాజకీయాల్లో కక్షలకు తావుండకూడదని, భవిష్యత్తులో ఇలాంటి సంప్రదాయం కొనసాగకూడదని పేర్కొన్నారు.
డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తూమాటి మాధవరావు అనంతరం వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనకు డిప్యూటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. శాసనమండలిలో వైకాపా విప్‌గా నియమితులైన ఇసాక్ బాషా కూడా జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















