ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. నవంబరులో విశాఖపట్నంలో జరిగే సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు సన్నాహక కార్యక్రమంలో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన ఆయన మంగళవారం మధ్యాహ్నం ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పుభాగాన ఉన్న రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను చేర్చింది. ఈ నేపథ్యంలో పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి తాము ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు ఆర్థిక మంత్రికి వివరించారు. రాయలసీమలో హార్టీకల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ, జీడి, కొబ్బరితోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు తయారుచేసినట్లు చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తే ఈ ప్రణాళికలను వెంటనే కార్యాచరణలో పెట్టడానికి వీలవుతుందని వివరించారు. వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పూర్వోదయ నిధులు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, భాజపా ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.

జీఎస్టీ సంస్కరణలపై అమిత్‌షాతో చర్చ
చంద్రబాబు మంగళవారం రాత్రి హోం మంత్రి అమిత్‌షాతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించినట్లు తెలిసింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, దీనిపై అక్టోబర్ 16న ప్రధానమంత్రి మోదీ చేయబోతున్న రాష్ట్ర పర్యటన గురించి సీఎం అమిత్‌షాకు వివరించినట్లు తెలిసింది. ఇది మర్యాదపూర్వక భేటీయేనని, ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రభుత్వపరమైన అంశాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని వర్తమాన రాజకీయాంశాలపైనా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రతిపాదిత ప్రాజెక్టులపై వినతి
అంతకు ముందు జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం పనుల పురోగతి గురించి సీఎం ఆయనకు వివరించినట్లు తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో పెద్ద మొత్తంలో కృష్ణా, గోదావరి నదీజలాలు సముద్రం పాలయ్యాయని.. వాటిని సద్వినియోగం చేసుకొనేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు తగిన చేయూతనివ్వాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిసింది.





















