ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్.. భారత్ పర్యటన నేపథ్యంలో టీమ్ఇండియాతో ( రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా రేపు (గురువారం) అహ్మదాబాద్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా రిషభ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) .. ఈ సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తా అని చెబుతున్నాడు. జురెల్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
‘టెస్ట్ జట్టులోకి రావడం అద్భుతంగా ఉంది. ఆసియా కప్ ఇటీవలే పూర్తైంది. ఇండియా- ఎ జట్టులో ఆడుతున్నా. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ నుంచి రెడ్ బాల్ క్రికెట్‌లోకి అడుగు పెడుతున్నా. చాలా ఉత్తేజంగా ఉంది. ఆస్ట్రేలియా- ఎతో ఆడాను. వారిపై రాణిస్తే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లవచ్చు.
దురదృష్టవశాత్తు రిషభ్ పంత్ గాయపడటం చాలా బాధాకరం. అతడి స్థానంలోనే నేను టీమ్‌లోకి వచ్చాను. ఆటలో నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. టీమ్ ఇండియాకు ఆడాలనుకోవడం ప్రతి ఒక్క క్రికెటర్ కల. వెస్టిండీస్‌తో హోం సిరీస్‌లో నాకు ఆ అవకాశం వచ్చింది. కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ప్రోత్సహిస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అతడు ఎంతో అనుభవమున్న కెప్టెన్‌లా వ్యవహరిస్తున్నాడు. జట్టులో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది.
ప్రత్యర్థి జట్టు స్వ్కాడ్‌ను పరిశీలించా. అందులో ఎంతమంది సీమర్లు, స్పిన్నర్లు ఉన్నారో గమనించా. వాళ్ల ప్లాన్ ఎమిటా అని ఆలోచించా. దానికి తగ్గట్లు నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నా. సీనియర్ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటున్నా. వాళ్ల అనుభవం నాకు మార్గనిర్దేశనం చేస్తుంది’ అని ధ్రువ్ జురేల్ పేర్కొన్నాడు


















