తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణ, వాటిని స్కిల్స్ వర్సిటీ పరిధిలోకి తీసుకురావడం, జీఓ 97పై అసెంబ్లీలో చర్చ జరిగింది. విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని శక్తిశాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.8 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
కళాశాలలను ప్రైవేటీకరిస్తారని, వాటి భూములను విక్రయిస్తారని అధ్యాపకులు, విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనపై ప్రభుత్వం స్పందించిందని మంత్రి చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే కమిటీని నియమించామని, కమిటీ సిఫారసుల ఆధారంగా జీఓ 97లో అవసరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్కిల్స్ వర్సిటీ పరిధిలోకి వచ్చినప్పటికీ పాలిటెక్నిక్ కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు కొనసాగుతుందని, ఈసెట్ ద్వారా లేటరల్ ఎంట్రీతో బీటెక్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే విద్యార్థులపై అదనపు ఫీజు భారం పడదని స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలల భూములను విక్రయించనున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ప్రభుత్వం భూములను విక్రయించేందుకు కాకుండా విద్యా మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం 282 ఎకరాల భూమిని కేటాయించినట్లు వెల్లడించారు.
విద్యారంగ సంస్కరణలు, ప్రస్తుత పరిస్థితిపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భాజపా సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో అధ్యాపకుల ఖాళీలపై ఆందోళన వ్యక్తం చేశారు. బాసర ఆర్జీయూకేటీలో 222 మంది ఆచార్యులు ఉండాల్సి ఉండగా కేవలం 19 మంది రెగ్యులర్ ఆచార్యులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 73 శాతం ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు.
సీపీఐ సభాపక్షనేత కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ప్రశంసించారు. విద్యాభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమర్థంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 612 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరని, ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రాలే నీట్ నిర్వహించుకునేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రిని కోరారు.
చర్చలో సభ్యులు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంఐఎం సభ్యులు మాజీద్ హుస్సేన్, అలీ తదితరులు పాల్గొన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ విద్యారంగంపై పాట పాడి సభలో వినిపించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















