తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా నాలుగు కాళ్లతో నడిచే ‘క్వాడ్రుపెడ్ రోబోట్’ లేదా ‘రోబో డాగ్’ను ప్రయోగాత్మకంగా వినియోగిస్తోంది.
తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ రోబో పనితీరును తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. కొండ ప్రాంతాల్లో రోబో కదలికలు, నిఘా సామర్థ్యం, ప్రతికూల పరిస్థితుల్లో దాని పనితీరును పరిశీలించారు. రోబో పనితీరు అద్భుతంగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ రోబోలో అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు, థర్మల్ ఫీడ్ వంటి సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి. కారుచీకటి, దట్టమైన పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ పరిసరాలను పరిశీలిస్తూ వన్యప్రాణుల కదలికలను గుర్తించగలదు. సాధారణ వాహనాలు లేదా మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండే కొండకోనలు, రాళ్లతో కూడిన ప్రాంతాల్లోనూ ఇది సులభంగా సంచరించేలా రూపొందించారు.
తిరుమల నడక మార్గాలకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారం తరచూ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా అలిపిరి-తిరుమల నడక మార్గంలో భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రోబో డాగ్ ద్వారా అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని తితిదే భావిస్తోంది.
వన్యప్రాణి భక్తులు సంచరించే ప్రాంతం వైపు వస్తున్నట్లు రోబో గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. జియో-ట్యాగ్‌తో కూడిన అలర్ట్‌తో పాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను పంపే సామర్థ్యం దీనికి ఉంది. దీంతో అధికారులు జంతువు ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
రోబోలో ఏర్పాటు చేసిన సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి వన్యప్రాణులను నేరుగా తాకకుండా లేదా మనుషులు దగ్గరకు వెళ్లకుండా వాటి దిశను మార్చే అవకాశం కూడా ఉంది. తద్వారా భక్తులకు, అటవీ సిబ్బందికి ఎదురయ్యే ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ ఈ రోబోను రూపొందించింది. ప్రస్తుతం ఒక రోబోను తిరుమలకు తీసుకువచ్చి 20 రోజులపాటు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో దాని కదలికలు, వన్యప్రాణుల గుర్తింపు, కమ్యూనికేషన్ వ్యవస్థ, అలర్ట్ సామర్థ్యం తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.
వచ్చేనెలలో జరగనున్న బ్రహ్మోత్సవాల సమయంలో అటవీ ప్రాంతాల్లో ఈ రోబోను వినియోగించేందుకు తితిదే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే సమయంలో అటవీ మార్గాలు, నడక దారులు, పరిసర ప్రాంతాల్లో అదనపు నిఘా వ్యవస్థగా దీన్ని ఉపయోగించనున్నారు.
ఒక్కో రోబో డాగ్ ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయోగాత్మక వినియోగం విజయవంతమైతే అవసరాన్ని బట్టి మరిన్ని రోబోలను అందుబాటులోకి తీసుకురావడంపై తితిదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మనుషులు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు, వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడం, భక్తులను అప్రమత్తం చేయడం వంటి అంశాల్లో ఈ సాంకేతికత ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రయోగాత్మక పరీక్షల ఫలితాల ఆధారంగా తిరుమలలో దీని వినియోగంపై తితిదే తుది నిర్ణయం తీసుకోనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















