ఇంటర్నెట్‌డెస్క్: ఎప్పుడూ చైనా పై ఏదో ఒక దర్యాప్తు మొదలుపెట్టామని అమెరికా చెప్పడం సర్వ సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ సారి సీను రివర్స్ అయింది. వాషింగ్టన్ రెండు అంశాల్లో తప్పుడు విధానాలు అవలంభిస్తోందంటూ.. బీజింగ్ రెండు దర్యాప్తులు మొదలుపెట్టింది. అది కూడా స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో రెండు దేశాల మధ్య చర్చలు మొదలుకానున్న వేళ కావడం గమనార్హం. ఈ సమావేశంలో జాతీయ భద్రత, టిక్‌టాక్ సోషల్ మీడియా యాజమాన్య హక్కుల వంటివి చర్చకు రానున్నాయి.
అమెరికా సెమీకండెక్టర్లను లక్ష్యంగా చేసుకొని చైనా ఈ దర్యాప్తులు చేపట్టింది. కొన్ని ఐసీ చిప్స్‌లో అమెరికాపై యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్‌ను మొదలుపెట్టింది. వీటిని అమెరికాలోని టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఆన్ చిప్స్ సంస్థలు తయారు చేస్తుంటాయి. చైనా లో తయారైన సెమీకండెక్టర్లపై వివక్ష చూపుతోందంటూ మరో దర్యాప్తును చేపట్టింది.
ఆదివారం మాడ్రిడ్‌లో చైనా వైస్‌ప్రీమియర్ లిఫెంగ్, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ భేటీ కానున్నారు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, టారిఫ్‌లు వంటి వాటిని ఈ సందర్భంగా చైనా బలంగా ప్రస్తావించే అవకాశం ఉంది. శుక్రవారం అమెరికా ప్రభుత్వం 23 సంస్థలను ఆంక్షల పరిధిలోని జాబితాలో చేర్చడంతో చైనా ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకొంది. వీటిల్లో చైనా చిప్స్ తయారీ సంస్థ ఎస్‌ఎమ్‌ఐసీ కూడా ఉంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన గురిని చైనా పై పెట్టారు. నాటో దేశాలన్నీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని శనివారం పిలుపునిచ్చారు. దాంతోపాటు రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా సంకేతం పంపారు. భారీస్థాయిలో డ్రాగన్‌పై సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.




















