మూడేళ్లుగా యువకుడి పొట్టలో చిక్కుకుపోయిన పెన్నును గుంటూరు జీజీహెచ్ వైద్యులు నైపుణ్యంతో విజయవంతంగా బయటకు తీశారు. గుంటూరుకు చెందిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ మూడేళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టాడు.గత ఏడాది నుంచి తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండగా, తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చేసిన పరీక్షల్లో అతడి పేగుల్లో సమస్య ఉన్నట్లు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం జీజీహెచ్‌కు పంపించారు.జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించి యువకుడి పేగులో పెన్ను ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ఆపరేషన్ అవసరం లేకుండానే ఎండోస్కోపీ విధానంతో పెన్నును చాకచక్యంగా బయటకు తీశారు.




















