ఇంటర్నెట్ డెస్క్: దేశంలో 140 కోట్లమంది ఉన్నారని గొప్పలు చెప్పుకొనే భారత్.. తమ దగ్గరి నుంచి గుప్పెడు మొక్కజొన్నలూ కొనడం లేదని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. అగ్రరాజ్యంపై (US) విధిస్తున్న సుంకాలను తగ్గించాలని, లేదా తమతో వ్యాపారం విషయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిందేనని నోరుపారేసుకున్నారు. పెద్దఎత్తున సుంకాలు విధిస్తూ.. భారత్, కెనడా, బ్రెజిల్ వంటి కీలక మిత్రదేశాలతో విలువైన సంబంధాలను సరిగ్గా నిర్వహిస్తున్నారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానం చెప్పారు.
‘‘భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. వారు ఇక్కడ విక్రయాలు చేపడుతూ.. ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ, మమ్మల్ని వారి దేశంలో అడ్డుకుంటున్నారు. 140 కోట్ల జనాభా ఉందని భారత్ గొప్పలు చెప్పుకొంటుంది. మరి.. మా మొక్కజొన్నలను ఎందుకు కొనరు? ఇది న్యాయమేనా? ప్రతిదానిపైనా సుంకాలు విధిస్తోంది. న్యాయమైన పరస్పర వాణిజ్యం నిర్వహిద్దామని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. మేం ఏళ్లతరబడి తప్పు చేశాం. కాబట్టి సుంకాల చర్యలు తీసుకున్నాం. ఇది అధ్యక్షుడి నమూనా. దీన్ని అంగీకరించాలి. లేదా ప్రపంచంలో గొప్ప వినియోగదారుడి తో వ్యాపారం విషయంలో కష్టకాలం తప్పదు’’ అని లుట్నిక్ వ్యాఖ్యానించారు.
భారత్- అమెరికా మధ్య సుంకాల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లను 50 శాతానికి పెంచారు. గత నెల నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అమెరికా అదనపు సుంకాలు సహేతుకం కాదని భారత్ ఇప్పటికే ఖండించింది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలకు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే.. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడం అంత తేలికైన విషయం కాదని, రష్యాపై చర్యల కోసం దిల్లీతో విభేదానికి సిద్ధమయ్యామని ట్రంప్ తాజాగా పేర్కొన్నారు




















