కొన్నిసార్లు చిన్న మెసేజ్ రాయాలన్నా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందిని తగ్గించటానికి వాట్సాప్ కొత్తగా ఏఐ ఆధారిత ‘రైటింగ్ హెల్ప్’ అనే టూల్‌ను తీసుకొస్తోంది. మన ఆలోచనలను సరైన రాత రూపంలోకి ఎలా మార్చాలో తెలియని స్థితిలో సాయం చేస్తుంది. ఉచితమైన పదాలను జొప్పించి సందేశాన్ని మరింత మర్యాదపూర్వకంగా మార్చగలదు. ఆఫీసు వ్యవహారాల్లో సూటిగా జవాబు ఇవ్వటం, స్నేహితుడికి వ్యంగ్యంగా సందేశం పంపటం, ఎవరైనా కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆలోచనాయుత ఓదార్పు ఇవ్వటం వంటి పనులెన్నింటికో దీన్ని వాడుకోవచ్చు. ఇది చిటికెలో ఏఐ సృష్టించిన సూచనలను అందిస్తుంది. వీటిని నేరుగా పంపొచ్చు లేదా మార్పులైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికిది అమెరికాలో ఇంగ్లిష్ మాట్లాడేవారికే పరిమతమైంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. బృంద లేదా వ్యక్తిగత చాట్ చేస్తున్నప్పుడు మెసేజ్‌ను టైప్ చేసి, కొత్తగా జోడించిన చిన్న పెన్సిల్ గుర్తును తాకి ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఏఐతో సమ్మిళితమైనప్పటికీ గోప్యతకు ఎలాంటి భంగమూ వాటిల్లదు. ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో కూడుకొని ఉండటం వల్ల పరికరానికే పరిమితమవుతుంది. పంపేవారు, అందుకునేవారు తప్ప మరొకరు యాక్సెస్ చేయలేరు. అంటే యథాలాప చాట్స్ అయినా, వ్యక్తిగత సంభాషణలైనా.. చివరికి అచ్చుతప్పులైనా భద్రంగా ఉంటాయన్నమాట.




















