ఈనాడు, అమరావతి: ఇంద్రకీలాద్రి దసరా సంబరాలకు ఈ ఏడాది భక్తులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. గత సంవత్సరం దసరా పది రోజుల్లో 8.94 లక్షలు, ఆ తర్వాత రెండు రోజులు వచ్చిన భవానీ భక్తులను కలిపితే.. సంఖ్య 12 లక్షలకు చేరింది. ఈ ఏడాది సోమవారం మూలానక్షత్రం రోజున వచ్చిన 1.95 లక్షల మంది, మంగళవారం శ్రీదుర్గాదేవి దర్శనానికి వచ్చిన 1.30 లక్షల మందిని కలిపితే.. భక్తుల సంఖ్య తొమ్మిది రోజులకే 11 లక్షలు దాటింది. చివరి రెండు రోజుల్లో 3 లక్షల మందికి పైగా దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ లెక్కన దసరా ముగిసేసరికే.. 14 లక్షలు దాటబోతున్నారు. ఆ తర్వాత రెండు రోజులు రాజరాజేశ్వరిదేవి రూపంలోని దుర్గమ్మ దర్శనమిస్తుంది. కనీసం 3 నుంచి 4 లక్షల మంది భవానీ భక్తులు తరలిరానున్నారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఈ ఏడాది 18 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగానే అంచనా వేశారు. ఊహించినట్టుగానే భక్తులు మొదటి రోజు నుంచే పోటెత్తారు. ప్రస్తుతం ప్రకటించిన లెక్కల కంటే మరో 10 నుంచి 20 శాతం భక్తులు అదనంగా ఉంటారని అధికారులు పేర్కొన్నారు. గతంలో మొదటి ఐదు రోజుల్లో లక్ష దాటడం గగనం. అలాంటిది ఈసారి మూడో రోజు నుంచే లక్ష దాటిపోయారు. ఆ తర్వాత నుంచీ రద్దీ పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం, విజయవాడ ఉత్సవ్.. రద్దీ పెరగడానికి ప్రధాన కారణాలు.
















