ఈనాడు, దిల్లీ: దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అన్నదాతల కంటే ఎక్కువగా విద్యార్థులవే ఉంటున్నాయి. జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 13,892 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులో బాలురు 7,330 మంది, బాలికలు 6,559 మంది, ట్రాన్స్‌జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఇది రైతులు, రైతుకూలీల ఆత్మహత్యలకంటే 28.79% అధికం. మొత్తం బలవన్మరణాల్లో 47% మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడుల్లోనే చోటుచేసుకున్నాయి. రైతుల ఆత్మహత్యలు 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగాయి. విద్యార్థుల బలవన్మరణాలు జరగని రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం అంటూ ఒక్కటీ లేదు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ సంఘటనలు నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాల్లో వెయ్యికి మించి, 15 రాష్ట్రాల్లో వందకు మించి విద్యార్థులు తనువు చాలించారు. మహారాష్ట్ర (2,046), మధ్యప్రదేశ్ (1,459), ఉత్తర్‌ప్రదేశ్ (1,373), తమిళనాడు (1,339) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ (582), ఆంధ్రప్రదేశ్ (498) పది, పదకొండో స్థానాల్లో ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 1,71,418 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో రైతుల శాతం 6.3గా ఉంటే, విద్యార్థుల శాతం 8.1. 2014తో పోలిస్తే 2023 నాటికి విద్యార్థుల ఆత్మహత్యలు 72% పెరిగాయి… రైతుల ఆత్మహత్యలు 12.73% తగ్గాయి.


















