ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన నిర్మించాలని సీఎం సూచన
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్ మారనుంది. ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారి మార్గంలో నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదించగా దాన్ని మార్చాలని సెప్టెంబరు 11న దక్షిణ మధ్య రైల్వే అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు వస్తున్న నేపథ్యంలో అదే మార్గంలో హైస్పీడ్ కారిడార్ రైలు ప్రాజెక్టు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనికి జీఎం అనుమతి వచ్చాక సర్వే ప్రారంభమవుతుంది. మరోవైపు హైదరాబాద్-బెంగళూరు ఎలైన్‌మెంట్ విషయంలోనూ ప్రభుత్వం పలు సూచనలు చేసింది.
మూడు రాష్ట్రాలు.. రూ.3.30 లక్షల కోట్లు
హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా కర్ణాటకలోని బెంగళూరు వరకు హైస్పీడ్ కారిడార్‌కు రూ.1.44 లక్షల కోట్లు.. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడులోని చెన్నై వరకు కారిడార్‌కు రూ.1.86 లక్షల కోట్లు.. మొత్తం రూ.3.30 లక్షల కోట్ల ఖర్చవుతుందని అంచనా.
హైదరాబాద్-చెన్నై మార్గంలో
రైల్వే శాఖ ప్రతిపాదన: హైదరాబాద్-శంషాబాద్- నార్కట్‌పల్లి- సూర్యాపేట- ఖమ్మం నుంచి ఏపీలో అమరావతి మీదుగా చెన్నైకి.
రాష్ట్ర ప్రభుత్వం కోరింది: శంషాబాద్ నుంచి మిర్యాలగూడ ప్రాంతం వైపుగా అమరావతికి నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎలైన్‌మెంట్ పక్కనుంచి.
హైదరాబాద్-బెంగళూరు మార్గంలో
రైల్వే ప్రతిపాదన: హైదరాబాద్- శంషాబాద్- మహబూబ్‌నగర్-వనపర్తి రోడ్ నుంచి ఏపీలోని కర్నూలు-డోన్, గుత్తి మీదుగా బెంగళూరుకు.
రాష్ట్ర ప్రభుత్వం కోరింది: హైస్పీడ్ కారిడార్ దగ్గరి దారి కావాలి. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్‌తో జాతీయ రహదారి వస్తుంది. హైస్పీడ్ రైలు కారిడార్‌ను శ్రీశైలం మీదుగా చేపట్టాలి. దీనిపై అధ్యయనం చేసిన రైల్వే శాఖ ఈ నిర్మాణం వ్యయప్రయాసలతో కూడు కుందని భావిస్తున్నట్లు తెలిసింది.


















