జైపుర్: రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరుగుతున్న ఆర్ట్స్ వీక్ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తోంది. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా పునఃసృష్టించారు. దేశవిదేశాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జోధ్‌పుర్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయటంతోపాటు సామాజిక మార్పునకు కళలు శక్తిమంతమైన సాధనమని చాటడమే లక్ష్యంగా ఈ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా కళాత్మక పర్యావరణ వ్యవస్థలను ఈ ప్రదర్శన వేదికపై సృష్టించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా తమ కళా నైపుణ్యాన్ని, సృజనాత్మకతను కళాఖండాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. అంతరించిపోయే దశలో ఉన్న మొక్కలను ముఖ్యంగా జోధ్‌పుర్‌లో కొన్నిరకాల మొక్కలు, వృక్ష జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. పొడి, ఎడారి ప్రాంతాల్లో మాత్రమే పెరిగే ఆ వృక్షాలు, మొక్కల ఆకులు, కాయలను స్థానికంగా కూరలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరాన్ని చాటుతూ హైదరాబాద్‌కు చెందిన కళాకారిణి సరుహ కిలారు గాజు కుండల్లో ఆ మొక్కలపై రూపొందించిన కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రావుజోధా పార్క్‌లో సంరక్షించిన ఖేజ్రీ, కేర్, కుంతి, తదితర వృక్షజాతుల ప్రతిరూపాలను సరుహ గాజు కుండల్లో పునఃసృష్టించారు. సరుహ ప్రయత్నంపై ఆమె తండ్రి, భాజపా నేత దిలీప్ కిలారు హర్షం వ్యక్తం చేశారు.


















