విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి వినీలా గజపతిరాజు, కుమార్తె, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు అశోక్ గజపతిరాజుకు స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ఈవో శిరీష, ఉత్సవాల ప్రత్యేకాధికారి మూర్తి ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఉత్సవాల నాటికి అమ్మవారి నూతన ఆలయం అందుబాటులోకి వస్తుందన్నారు. కొన్ని కారణాల వల్ల రెండేళ్లుగా ఆలయ ఆధునికీకరణ ముందుకు సాగలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ సమస్యలన్నీ తొలగిపోయాయని.. కొత్త ఆలయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయన్నారు. పాలకులు రాజ్యాంగం, వ్యవస్థలను గౌరవించాలని చెప్పారు. సొంత మతాలను ఆదరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలన్నారు.



















