కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు తాటిక నారాయణరావు (62) మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తుండగా “బహిర్భూమికి వెళ్తాను” అని చెప్పడంతో, పోలీసులు తుని పట్టణ శివారులోని కోమటిచెరువు వద్ద వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో నారాయణరావు చెరువులోకి దూకినట్లు పోలీసులు తెలిపారు.
తుని గ్రామీణ పోలీస్‌స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే గజఈతగాళ్ల సాయంతో రాత్రి నుంచే శోధన ప్రారంభించగా, గురువారం ఉదయం మృతదేహం కనుగొన్నారు.
మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి బయటకు తీసుకువెళ్లి నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలికకు తినుబండారాలు కొనిపెట్టి, మాయమాటలు చెప్పి స్నేహం పెంచుకున్నాడు. సిబ్బంది వద్ద “తాను ఆ బాలిక తాత” అని చెప్పి నమ్మబలికాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తానంటూ బయటకు తీసుకువెళ్లి, తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం బయటపడడంతో బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కోర్టుకు తరలిస్తుండగా చెరువులో దూకి నిందితుడు మృతిచెందాడు.




















