అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో ఉన్నప్పటికీ రాష్ట్ర యంత్రాంగంపై నిఘా ఉంచుతున్నారు. వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితిని తెలుసుకుంటూ సీఎస్, ఆర్టీజీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభావిత ప్రాంతాలకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంచేశారు.
రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్‌అండ్‌బి, విద్యుత్ శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. కాలువలు, చెరువుల గట్లకు గండ్లు పడకుండా బలహీన ప్రాంతాలను పటిష్టం చేయాలని, వర్షాల అనంతరం అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి శాఖ సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.



















