ఆత్మకూరు(ఎం): వర్క్ ఫ్రం హోం చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంగళవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లిలో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో భూషి గణేశ్ (26) మృతి చెందగా, ఆయన తండ్రి నర్సింహకు గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గణేశ్ బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కొన్ని రోజులుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇటీవల వారి ఇంటి గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ పనులు జరిపారు. పనుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప పైపును తొలగిస్తున్న సమయంలో గోడ పక్కన ఉన్న విద్యుత్ తీగలకు పైపు తాకడంతో విద్యుదాఘాతం జరిగింది.
గణేశ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒకే కుమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులు తీవ్ర రోదనలో మునిగారు.


















