నెన్నెల, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో నత్తలు పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ నర్సరీలో గతేడాది కనిపించిన నత్తలు ప్రస్తుతం ఊరంతా వ్యాపించి, పంటలనూ తినేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంపులుగా కనిపిస్తున్నాయి. కూరగాయలు, పత్తి చేనులు వీటి బారిన పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు చెట్లపై నుంచి వీటిని ఏరివేస్తూ తట్టలో పట్టుకొని బయట పారేస్తున్నారు. సమస్యపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజును వివరణ అడగ్గా.. ‘చాలా వరకు ఇవి అటవీ నర్సరీల్లో కనిపిస్తుంటాయి. అధిక తేమ, వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తాయి. ఇవి పంటలపై దాడులకు దిగితే రైతులు అప్రమత్తంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. నందులపల్లి గ్రామాన్ని త్వరలో సందర్శించి అక్కడి పరిస్థితిని బట్టి సూచనలు చేస్తామన్నారు.


















