ప్రకృతి రమణీయ దృశ్యాలకు, పెద్దపులులకు నిలయం నల్లమల అడవులు. ఇందులో విహారానికి తలుపులు తెరిచింది అటవీశాఖ. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం నేపథ్యంలో జులై నుంచి మూడు నెలల పాటు నిలిపివేసిన సఫారీని అక్టోబరు 1 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. అమ్రాబాద్ అభయారణ్యంలోని పర్యాటక ప్రాంతాలు, కృష్ణా నది పరవళ్లను తిలకించేందుకు రెండు ప్యాకేజీలుగా ఆయా పర్యటనలకు వీలు కల్పిస్తోంది.. మరి చూసొద్దాం రండి!
అక్కమహాదేవి గుహల ప్యాకేజీ..
ఈ ప్యాకేజీ కోసం ఆన్‌లైన్‌లో www.amrabadtigerreserve.com లో సఫారీ (వాహన సౌకర్యం), వసతిని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా ఏసీ గదిలో రాత్రి బసకు ఒక జంటకు రూ.6 వేల నుంచి రూ.7,500, 8 ఏళ్లు దాటిన పిల్లలకు అదనంగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న పర్యాటకులు మధ్యాహ్నం 12:30కు అమ్రాబాద్ మండలంలోని బ్రహ్మగిరి (దోమలపెంట) వనవిహంగ కార్యాలయానికి చేరుకోవాలి. కాటేజ్‌లో చెక్‌ఇన్ అయ్యాక.. సఫారీలో ఆక్టోపస్ వ్యూపాయింట్, వజ్రాల మడుగు, వాచ్‌టవర్ నుంచి కృష్ణ్ణా నదిని వీక్షించేందుకు తీసుకెళతారు. సాయంత్రం 7.30కు తిరిగి కాటేజ్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు అడ్వెంచర్ ట్రిప్ తిరిగి ప్రారంభమవుతుంది. కృష్ణా నదిలో పడవపై ప్రయాణించి అక్కమహాదేవి గుహలకు చేరుకుంటారు. గుహల వద్ద 8 గంటలకు అల్పాహారం చేసి 10 గంటల వరకు గుహను సందర్శించవచ్చు. గైడ్ ఉంటారు. 11 గంటలకు కృష్ణా నదిలో తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించి 12 గంటలకు కాటేజ్‌లకు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.


















