న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం:
శాంతియుత అణుశక్తి వినియోగానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని రాజమహేంద్రవరం ఎంపీ ద్రౌపది పురందేశ్వరి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రకటించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) నివేదికపై దేశం తరఫున ఆమె ప్రసంగించారు.
పురందేశ్వరి మాట్లాడుతూ, అణు విజ్ఞానం మరియు సాంకేతికతను శాంతియుత, సురక్షిత విధానాల్లో వినియోగించుకునే దిశగా ఐఏఈఏ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమని అన్నారు. భారత్ తరఫున ఆ సంస్థకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
అణుశక్తి అనేక రంగాల్లో బహుముఖ ప్రయోజనాలను అందిస్తోందని ఆమె వివరించారు. ముఖ్యంగా స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి రంగాల్లో అణు శక్తి ప్రాముఖ్యత అపారమని పురందేశ్వరి అన్నారు.
అణు విద్యుత్ పరిశోధనల్లో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైందని, భాగస్వామ్య దేశాలతో అణు నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా భారత్ ఐఏఈఏ లక్ష్యాలను సాధించడంలో భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు.



















