హైదరాబాద్ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, ఇటీవల కొత్త సంస్థలు కూడా రంగప్రవేశం చేస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్లు, నావిగేషన్ వ్యవస్థలు, ట్రైనింగ్ పరికరాలు, విడిభాగాల తయారీ వంటి విభాగాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి.
ఇంతకుముందు భారత్ రక్షణ అవసరాల కోసం ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా వంటి దేశాలపై ఆధారపడేది. కానీ ‘మేక్ ఇన్ ఇండియా’ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రోత్సాహక చర్యలతో దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం వేగంగా పెరుగుతోంది. ఫలితంగా హైదరాబాద్‌లోని కంపెనీలకు రక్షణ శాఖ, డీఆర్‌డీఓ వంటి సంస్థల నుంచి భారీ ఆర్డర్లు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఇప్పటికే డీఆర్‌డీఓ, బీడీఎల్, మిధాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ రక్షణ సంస్థలు ఉన్నాయి. వీటి సహకారంతో జెన్ టెక్నాలజీస్, అవాంటెల్, అస్త్ర మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి ప్రైవేటు కంపెనీలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి.
జెన్ టెక్నాలజీస్‌కు తాజాగా యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ తయారీ కోసం రక్షణ శాఖ రూ.289 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. అలాగే అస్త్ర మైక్రోవేవ్ సంస్థకు వాయుసేన అవసరాల మేరకు కమ్యూనికేషన్ పరికరాల సరఫరాకు రూ.285.56 కోట్ల కాంట్రాక్ట్ లభించింది. అవాంటెల్ సిస్టమ్స్‌కూ పలు మధ్యస్థాయి ఆర్డర్లు వచ్చాయి.
చిన్న, మధ్యస్థాయి సంస్థలు కూడా ఈ రంగంలో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాయి. దీంతో రక్షణ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు పెరుగుతుండటం హైదరాబాద్ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా మరింత బలపడుతోందని నిపుణులు చెబుతున్నారు.




















