హుజూర్‌నగర్, న్యూస్‌టుడే: గ్యాస్ వినియోగదారులు జాగ్రత్త! ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయకపోతే ఇకపై సబ్సిడీ రాయితీ లభించదు. ప్రతి సంవత్సరం ఒకసారి ధ్రువీకరణ చేసుకున్న వారికే సబ్సిడీ కొనసాగుతుంది. ఆ ఏడాది ధ్రువీకరణ చేయకపోతే, ఆ సంవత్సరం నుంచే సబ్సిడీ శాశ్వతంగా రద్దవుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన ఐవోసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం కంపెనీల వినియోగదారులందరికీ వర్తిస్తుంది.
ధ్రువీకరణ ప్రక్రియ పూర్తిగా ఉచితం. వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి లేదా సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా బయోమెట్రిక్ నమోదు చేయవచ్చు. అంతేకాదు, స్వయంగా యాప్‌లోనూ ధ్రువీకరణ పూర్తి చేయవచ్చు.
ప్రతి సంవత్సరం గరిష్ఠంగా 9 సిలిండర్లకు సబ్సిడీ లభిస్తుంది. అందులో 8వ, 9వ రీఫిల్ సమయంలో బయోమెట్రిక్ ధ్రువీకరణ జరిగితేనే సబ్సిడీ జమ అవుతుంది. ప్రతి ఏడాది మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా అధికారులు సూచించారు. ధ్రువీకరణ చేయకపోయినా గ్యాస్ సరఫరా ఆగదు కానీ, సబ్సిడీ మాత్రం రద్దవుతుందని హుజూర్‌నగర్ ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అనపపురెడ్డి లక్ష్మారెడ్డి తెలిపారు.


















