ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చేందుకు సంస్థ కొత్త చర్యలు చేపడుతోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి బస్సులో ఐ-ఎలర్ట్ పరికరంను అమర్చనుంది. ఈ పరికరం ద్వారా అధికారులు బస్సు నడిచే విధానాన్ని రియల్‌టైమ్‌లో పర్యవేక్షించవచ్చు.
డ్రైవర్ నడిపే తీరు, వేగం, బ్రేకులు, గేర్ మార్పులు, యాక్సిలేటర్ వినియోగం, ఇంధన వినియోగం వంటి వివరాలన్నీ ఇందులో నమోదవుతాయి. ఈ వివరాల ఆధారంగా డ్రైవర్లకు గ్రేడింగ్ ఇస్తారు. 10లో 6 కన్నా తక్కువ స్కోర్ వస్తే, డ్రైవింగ్‌లో లోపాలున్నట్లు గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రమాదం జరిగితే ఆ సమయంలో బస్సు స్పీడ్ తదితర వివరాలను ఈ పరికరం రికార్డ్ చేస్తుంది.
ఇది విమానాల్లో ఉపయోగించే బ్లాక్‌బాక్స్‌ల మాదిరిగా పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్-6 ఆర్టీసీ బస్సుల్లో ఈ పరికరాల అమరిక తుది దశలో ఉంది. త్వరలోనే ప్రతి బస్సులో ఈ ‘ఆరీ టెలీమ్యాటిక్స్’ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇటీవల అశోక్ లేల్యాండ్ ఇంజినీర్లు ఈ పరికరాల వినియోగంపై డిపో మేనేజర్లు, భద్రతా అధికారులు, మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చారు.


















