భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న వేళ దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఈ విజయానికి వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు, త్యాగాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు మహిళా క్రికెట్ అంటే పెద్దగా గుర్తింపు లేకుండా పోయేది. ఆ సమయంలో మహిళా క్రికెట్‌ను నిలబెట్టేందుకు పలు వ్యక్తులు ముందుకు వచ్చారు. వారిలో నటి, వ్యాఖ్యాత, ఫ్యాషన్ డిజైనర్ అయిన మందిరా బేడీ (Mandira Bedi) కూడా ఒకరు.
మాజీ క్రికెటర్ నూతన్ గావస్కర్ మాటల్లో – ‘‘ఒకసారి మహిళా టీమ్‌ను విదేశీ పర్యటనకు పంపేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. విమాన టికెట్లు కొనే స్థోమత కూడా లేకపోయింది. అప్పుడు మందిరా బేడీ ఓ కమర్షియల్ షూట్ చేస్తున్న సమయంలో ఆమెను కలిశాం. మా పరిస్థితి తెలిసిన వెంటనే ఆమె ఆ ప్రకటనకు తీసుకున్న పారితోషికాన్ని మొత్తం ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (WCAI)కి విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బుతోనే మేము ఇంగ్లాండ్ టూర్ టికెట్లు కొనగలిగాం,’’ అని గుర్తుచేశారు.
మహిళా జట్టు ప్రపంచకప్ సాధించిన తర్వాత మందిరా బేడీ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘మీరు కేవలం భారత దేశం కోసం మాత్రమే ఆడలేదు — మీరు దేశాన్ని కదిలించారు. ఒకప్పుడు నేను మహిళల క్రికెట్ పక్కన నిలబడి వారి ధైర్యాన్ని చూసాను. ఇప్పుడు ఆ శక్తిని మీరు ప్రపంచానికి చూపించారు,’’ అని ఆమె పేర్కొన్నారు.
టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించిన మందిరా బేడీ, తర్వాత సినిమాలు, స్పోర్ట్స్ ఈవెంట్ల వ్యాఖ్యానంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.




















