‘కార్తిక మాసం’కు సమానం గల మాసం లేదని, ‘విష్ణుదేవుడికి సమానుడు లేడని’, ‘గంగకు సమానమైన తీర్థం లేదని’ పురాణాలు వర్ణిస్తాయి. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన కార్తిక మాసం అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది. భక్తుల విశ్వాసం ప్రకారం ఇది శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం. కృత్తికా నక్షత్రం పౌర్ణిమ తిథితో కలిసినప్పుడు కార్తిక మాసం ప్రారంభమవుతుంది.
ఈ ఏడాది నవంబర్ 5, 2025 (బుధవారం) కార్తిక పౌర్ణిమ. సూర్య సిద్ధాంత పంచాంగ గణన ప్రకారం ఆ పౌర్ణిమ సాయంత్రం 6.35 గంటల వరకు (30 ఘడియల 48 విఘడియలు) ఉంటుంది. ఈ రోజు చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా ఉండి, ఆయన కిరణాలు భూమిని, జలాన్ని తాకడం వల్ల మనస్సు ప్రశాంతమవుతుందని నమ్మకం.
కార్తిక స్నానం సంవత్సరంలో చేసే స్నానాలలో అత్యంత పుణ్యప్రదమైనదిగా పేర్కొనబడింది. పౌర్ణమి రోజున స్నానం, దీపదానం, జపం, దైవదర్శనం చేస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. గంగ, గోదావరి, కృష్ణా, తుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం మహాపుణ్యం. నదీ స్నానం సాధ్యం కానివారు గంగాజలం కలిపిన నీటితో ఇంట్లోనే స్నానం చేయవచ్చు.
సాయంత్రం ఆకాశదీపం వెలిగించడం, సాలగ్రామ దానం, ఉసిరికాయల దానం వంటి ఆచారాలు కార్తిక పౌర్ణమికి విశిష్టమైనవిగా శాస్త్రోక్తం. ఇంటిలో లేదా దేవాలయంలో తులసి కోట వద్ద దీపాలు వెలిగించడం శ్రేయస్కరం. సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులతో దీపం వెలిగించడం ఒక ప్రత్యేక సంప్రదాయం.
“కార్తికేతు కృతా దీక్షా నృణాం జన్మవిమోచనీ” అనే వాక్యానుసారం ఈ మాసంలో దీక్ష స్వీకరించడం జన్మబంధనాల నుంచి విముక్తి కల్పిస్తుంది. కార్తిక పౌర్ణమి రాత్రి వెన్నెలలో పరమాన్నం వండుకొని భుజించడం కూడా ఒక ఆచారం.
శత్రువులపై విజయం కోసం దేవసేనాధిపతి కార్తికేయుని స్మరించడం శ్రేయస్కరం. చంద్రోదయ సమయంలో ఆయనను రక్షించిన ఆరు కృత్తికలను అగ్నిరూపంలో ఆరాధించాలి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెబుతాయి.
కాశీలో ఈ పౌర్ణమిని “దేవ దీపావళి”గా వైభవంగా జరుపుతారు. గంగా తీరమంతా వేలాది దీపాలతో ప్రకాశిస్తుంది. దేవతలే భూమిపైకి వచ్చి దీపారాధన చేస్తారని నమ్మకం. అరుణాచలంలో ‘కృత్తిక దీపం’, శృంగేరి శారదా పీఠంలో ‘లక్ష దీపోత్సవం’ ఘనంగా నిర్వహిస్తారు.
🔥 జ్వాలాతోరణం మహోత్సవం
కార్తిక పౌర్ణమి సాయంత్రం ప్రతి శివాలయంలో జ్వాలాతోరణం అనే పవిత్ర ఉత్సవం జరుగుతుంది. రెండు ఎత్తైన కర్రలను నాటి వాటిని కలిపి అడ్డంగా మరో కర్ర కట్టి, దానిపై ఎండుగడ్డిని చుట్టి నిప్పుతో వెలిగిస్తారు. అది శివలింగరూప జ్వాలా తోరణంగా భావించబడుతుంది. ఈ తోరణం కింద నుంచి శివపార్వతులను పల్లకిలో దాటిస్తారు. తరువాత భక్తులు కూడా దాని కింద నుంచి వెళ్లి తమ పాపాలు, దోషాలు నశించాలని ప్రార్థిస్తారు.
జ్వాలాతోరణం వెనుక పురాణ గాథలు
1. త్రిపురాసుర సంహారం:
ముగ్గురు రాక్షసులైన త్రిపురాసురులను శివుడు సంహరించిన రోజు ఇదే. అందుకే దీన్ని త్రిపుర పౌర్ణమి అంటారు. భర్త విజయాన్ని కాంక్షిస్తూ పార్వతీదేవి దోషపరిహారార్థం జ్వాలాతోరణం ఏర్పాటు చేసినట్లు పురాణం చెబుతుంది. ఈ విజయ సూచికగా తులసి వద్ద 365 దీపాలు వెలిగించడం ఆచారం.
2. హాలాహల విషం త్రాగిన శివుడు:
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని లోకక్షేమం కోసం శివుడు తాగి కంఠంలో నిలిపి నీలకంఠుడు అయ్యాడు. ఆ ఘట్టం తరువాత శివుడు, పార్వతీదేవి కుటుంబ సమేతంగా మూడు సార్లు జ్వాలాతోరణం దాటినట్లు చెబుతారు. ఆ తోరణంలోని గడ్డి పశువుల ఆహారంలో లేదా ధాన్యం నిల్వ ప్రదేశంలో ఉంచితే పశువృద్ధి, ధాన్యసంపద కలుగుతాయని విశ్వాసం.
3. నరక ద్వారం నుంచి విముక్తి:
జ్వాలాతోరణం దర్శనం లేదా దాని కింద నుంచి దాటడం ద్వారా పాపాలు నశించి, ఆరోగ్యం కలిగి, అపమృత్యువు నివారమవుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఇది నరకద్వార ప్రవేశం నుంచి విముక్తి ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
🪔 దీపదాన మహిమ
కార్తిక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి కనీసం ఒక దీపం వెలిగించడం విశేష పుణ్యఫలాన్ని ఇస్తుంది. దీపం వెలిగిస్తూ ఈ శ్లోకం పఠించాలి:
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||
ఈ దీపారాధన ద్వారా భూమిపైని అన్ని జీవరాశులకు మోక్షం కలగాలని మనం ప్రార్థిస్తాం. దీపం వెలిగించడం కేవలం పూజా విధి కాదు; అది మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని వ్యాప్తి చేసే ఆధ్యాత్మిక సందేశం.
కార్తిక పౌర్ణమి యొక్క మూలసారం:
“ప్రకాశమే జీవితం – అజ్ఞానమే చీకటి.”
దీపం వెలిగించడం అంటే మనసులో ప్రేమ, జ్ఞానం, సద్గుణాల వెలుగును వెలిగించడం — ఇదే ఈ పవిత్ర దినం బోధించే సందేశం.




















