న్యూయార్క్: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తమకు అద్భుతమైన అనుబంధం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతా భాగస్వామి అని వెల్లడించారు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ సోమవారం శ్వేతసౌధంలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. ప్రధాని మోదీతో అద్భుతమైన సంబంధం ఉందని, రాయబారిగా సెర్జియో గోర్ ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి, అమెరికా పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అమెరికన్ ఎనర్జీ ఎగుమతులను పెంచడానికి, భద్రతా సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మేం భారత్‌తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాం. ఇది మునుపటి దానికంటే భిన్నమైంది. ప్రస్తుతం వారు మమ్మల్ని ఎక్కువగా ఇష్టపడటం లేదు. కానీ త్వరలో మళ్లీ ఇష్టపడతారు. మేం న్యాయమైన ఒప్పందం సాధించబోతున్నాం’ అని ట్రంప్ అన్నారు. భారత్‌పై మొదట 25 శాతం సుంకాలు విధించిన అమెరికా, తర్వాత 50 శాతానికి పెంచింది.




















