ఇంటర్నెట్‌డెస్క్: భారతదేశ రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను పెంపొందించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ (DAD) 278వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత బాగా పెరిగిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఇది మనకు ఆందోళన కలిగించే విషయమన్నారు. కొత్తగా వస్తున్న సాంకేతికతలు ఏళ్లతరబడి పరిశోధన, అభివృద్ధి ఆధారంగా రూపొందించినవన్నారు. దీన్ని మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయని, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. అందుకే రక్షణ బడ్జెట్ కూడా ఏటా పెరుగుతుందని తెలిపారు. బడ్జెట్ పెరుగుదలతో దాన్ని తెలివిగా ఉపయోగించాల్సిన బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు. ఈ సందర్భంగా సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మన సాంకేతికత వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు.



















