ప్రతి మనిషి జీవితంలోనూ గ్రహాల ప్రభావం వల్ల శుభ, అశుభ ఫలితాలు ఎదురవుతాయి. అశుభ ఫలితాలు లేదా గ్రహ దోషాలు ఉన్నప్పుడు, వాటిని తొలగించుకోవడానికి విఘ్నేశ్వరుడిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. సూర్య దోషం నివారణకు ఎర్ర చందనంతో, కేతు దోషానికి తెల్ల జిల్లేడు పూలతో, చంద్ర దోష నివారణకు వెండి లేదా పాలరాతితో చేసిన గణపతిని పూజించాలి. కుజ దోషానికి రాగి వినాయకుణ్ణి, గురు దోషానికి పసుపు, చందనం లేదా బంగారంతో చేసిన విగ్రహాన్ని, బుధ దోష నివారణకు మరకత వినాయకుణ్ణి పూజించాలి. శుక్ర దోష నివారణకు స్ఫటిక వినాయకుడిని, శని దోషానికి నల్ల రాయిపై చెక్కిన గణపతిని, రాహు దోషానికి మట్టితో చేసిన వినాయకుణ్ణి భక్తితో పూజించడం ద్వారా ఆయా దోషాలు తొలగిపోతాయి. అలాగే, ఇంటిలో సుఖశాంతుల కోసం స్ఫటిక వినాయకుడిని, మానసిక ప్రశాంతత కోసం పాలరాతి గణపతిని పూజించాలి. ఎవరికి ఏ గ్రహ దోషం ఉందో తెలుసుకుని, పైన సూచించిన విధంగా గణపతిని ఆరాధిస్తే త్వరగా మంచి ఫలితాలు కనపడతాయి.



















