రాబోయే కాలంలో ఏ రంగాలకు ముఖ్యమైన అవకాశాలు ఉంటాయో గుర్తించి, ఆ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రదేశమని కూడా అన్నారు. గురువారం విశాఖలో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సుస్థిరాభివృద్ధి, భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై చర్చలు జరిగింది. ఆర్మేనియా ఆర్థిక వ్యవహరాల మంత్రి గివార్గ్ పొపాయాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణి, వివిధ కంపెనీల సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.
సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం, సమృద్ధి వనరులు ఉన్న ప్రదేశమని తెలిపారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోంది. గతంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించామన్నారు. గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల సీఈఓలుగా భారతీయులు ఉన్నారని చెప్పారు.
ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు మారిన తర్వాత జీవన ప్రమాణాలు పెరిగాయని, వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. కేంద్రం ప్రారంభించిన భారత్ క్వాంటం మిషన్ ద్వారా అవకాశాలను పొందాం. రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అలాగే, డ్రోన్ల వినియోగం, తయారీ, డిఫెన్స్ రంగంలో ఉపయోగం పెంచడానికి కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తామని, స్పేస్ అప్లికేషన్ల కోసం ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.


















