ఎర్రచందనం అక్రమ రవాణా అలాగే దొంగతనాల్లో పాత్ర ఉన్న గుమ్మళ్ల వెంకట సుబ్బయ్యపై పీడీ యాక్ట్ విధించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం జిల్లా పోలీసు వ్యవస్థకు ఆదేశాలు పంపించారు. అట్లూరు మండలం చలంగారిపల్లెకు చెందిన సుబ్బయ్య విలాస జీవనానికి అలవాటు పడటంతో, త్వరగా డబ్బు సంపాదించాలని భావించాడు. ప్రారంభంలో దొంగతనాలనే మార్గంగా ఎంచుకుని, తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అతను కఠిన నేరస్థుడిగా పోలీసు రికార్డుల్లో నమోదయ్యాడు. బద్వేలు సహా పలు పోలీసు స్టేషన్లలో దొంగతనం, ఎర్రచందనం రవాణాకు సంబంధించిన ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. దీనితో ప్రభుత్వం సుబ్బయ్యపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అతను బద్వేలు మండలం కుమ్మరికొట్టాలలో ఉంటున్నాడు.



















