వాషింగ్టన్, కైరో, జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునకు కీలక అడుగులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాకు సర్వత్రా ఆమోదం లభిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే అంగీకరించగా.. అధ్యయనం చేశాక చెబుతామని హమాస్ అంటోంది. ఆ సంస్థకూ ‘ఆయుధాలను వదిలేయడం’ అనే షరతుపైనే అభ్యంతరాలున్నాయి. మిగిలిన వాటికి అంగీకరించే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ ఫార్ములాలోని 5 అంశాలు శాంతిని నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. వాటిపై అంగీకారం కుదిరితే యుద్ధం ముగిసినట్లే! మరోవైపు భారత్, చైనా, రష్యాసహా పలు దేశాలు ట్రంప్ ప్రతిపాదనలకు సమ్మతిని తెలియజేశాయి.
ఆయుధాలను వదిలేయాలన్న అంశంపైనే హమాస్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకవేళ హమాస్ ఇందుకు నిరాకరిస్తే ఇజ్రాయెల్‌కు అమెరికా స్వేచ్ఛనిస్తుంది. ఫలితంగా ఇప్పటికే ధ్వంసమైన గాజా పూర్తిగా అల్లకల్లోలమవుతుంది. అయితే పాలస్తీనాకు దేశం హోదా అనేది ఉత్తుత్తి హామీగా మిగులుతుందేమోనన్న ఆందోళన వారిలో ఉంది. దీనిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించకపోవచ్చనేది వారి ఆందోళనకు కారణం.
1. కాల్పుల విరమణ
ఒప్పందం కుదిరిన 72 గంటల్లో బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి. ప్రతిగా 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. 1,700 మంది సాధారణ పౌరులనూ వదిలిపెట్టాలి.
2. బలగాల ఉపసంహరణ
బందీల విడుదల పూర్తి కాగానే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలగాలి. అయితే హమాస్ నిరాయుధీకరణ, అంతర్జాతీయ పాలక వర్గం ఏర్పాటయ్యాకే ఇది జరిగే అవకాశముంది. అదీగాక గాజా చుట్టూ ఇజ్రాయెల్ బలగాలు శాశ్వతంగా ఉండే అవకాశమూ ఉంది.
3. హమాస్ భవితవ్యం
గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు. దాని ఆయుధ వ్యవస్థలను, సొరంగాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గాజాలో అంతర్జాతీయ పాలన ప్రారంభమవుతుంది. అయితే ట్రంప్, నెతన్యాహు చేతుల్లోకి గాజా వెళ్లాక భారీగా బహిష్కరణలకు పాల్పడి ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మారుస్తారన్న అనుమానాలు హమాస్‌లో ఉన్నాయి.
4. పాలస్తీనాకు గుర్తింపు
అంతర్జాతీయ పాలన సమయంలో పాలస్తీనా అథారిటీ సంస్కరణలను అమలు చేసి గాజా బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది పాలస్తీనాకు దేశంగా గుర్తింపు ఇచ్చే అంశంలో చాలా చిన్న విషయంగా హమాస్ భావిస్తోంది.
5. ఇప్పటిదాకా స్పందన
ట్రంప్ ప్రణాళికపై హమాస్ నేతలతో ఖతార్, ఈజిప్టు నేతలు సోమవారం చర్చించారు. తాము మంచి ఆలోచనతోనే దీనిని పరిశీలిస్తామని, ఆ తరువాతే స్పందిస్తామని హమాస్ స్పష్టం చేసింది. నిరాయుధీకరణను హమాస్ తిరస్కరిస్తోంది. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమిస్తున్నంత కాలం తమకు ఎదిరించే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తోంది. స్వాగతించిన మోదీ గాజా యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇది దీర్ఘకాల శాంతికి బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు. అందరూ కలిసివచ్చి ట్రంప్ ప్రణాళికకు ఆమోదం తెలిపి కార్యాచరణ ప్రారంభిస్తారని ఆశిస్తున్నానని మంగళవారం ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు.
ట్రంప్ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ పాకిస్థాన్, ఈజిప్టు, జోర్డాన్, ఇండోనేసియా, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
ట్రంప్ ప్రణాళికను స్వాగతిస్తున్నామని, ఆయన ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తామని రష్యా ప్రకటించింది. ఈ ప్రణాళికను అమలు చేయాలని కోరుకుంటున్నామని అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి పెస్కోవ్ పేర్కొన్నారు.
ట్రంప్ 20 సూత్రాల ఫార్ములాను పాలస్తీనా అథారిటీ స్వాగతించింది. పాలస్తీనా ఏకీకరణకు సహకరిస్తామని స్పష్టం చేసింది.
చైనా కూడా ట్రంప్ ఫార్ములాకు ఆమోదం తెలిపింది.




















