పింఛను కేవలం వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అందించే సాధనం మాత్రమే కాదు, సంపద సృష్టించే మార్గమని పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్ శివసుబ్రమణియన్ రామన్ చెప్పారు. వృద్ధాప్యానికి ముందు యువత ధనవంతులుగా మారాలని ఆయన సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “25–40 ఏళ్ల వయసులో ఉన్నవారికి పింఛను పథకాల గురించి చర్చించకూడదని అనిపించవచ్చు. కానీ, పింఛను నిధులు సంపదను సృష్టించేందుకు ఉపయోగపడతాయి. పని చేయలేని వయసులో కూడా స్వయంగా జీవించడానికి తగినంత డబ్బు ఉండాలి” అని చెప్పారు.
దేశంలో 55 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో సంఘటిత రంగంలోని కేవలం 10 కోట్ల మంది మాత్రమే పింఛను పథకాల కింద ఉన్నారు. మిగిలిన 45 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు సాధారణ పొదుపు పథకాల నుంచి దూరంగా ఉంటున్నారు. చాలామంది ‘హామీతో కూడిన రాబడుల’ మోసపూరిత పథకాల వైపు ఆకర్షితులవుతున్నారని, వీరిని కాపాడటం తమ బాధ్యత అని రామన్ పేర్కొన్నారు.
రామన్ వివరాల ప్రకారం, జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజనాలు పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే కాంపోజిట్ స్కీమ్ గత 13–14 ఏళ్లలో 9 శాతానికి మించి వార్షిక సగటు రాబడిని ఇచ్చింది. 100% ఈక్విటీ ఫండ్లలో కొన్ని పథకాలు 18–19% రాబడిని అందిస్తున్నాయి. నెలకు రూ.3,000 మదుపుతో ప్రారంభించి ప్రతి ఏడాది 5–10% పెంపు చేస్తే, పెద్ద మొత్తంలో పింఛను నిధి సృష్టించవచ్చని ఆయన అన్నారు. కొత్త ఉద్యోగంలో చేరినవారికి పింఛను ఖాతా బ్యాంక్ ఖాతాకు తర్వత రెండవ అత్యంత ముఖ్యమైన ఖాతాగా ప్రారంభించమని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ పింఛను పథకాలు ఉన్నా, అందరికి అలాంటి సౌకర్యం లేదని తెలిపారు. అందరిని ఒకే పింఛను పథకంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం పీఎఫ్‌ఆర్‌డీఏతో కలిసి పనిచేస్తోందని, ఫిన్‌టెక్ మరియు ఫండ్ సంస్థల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు.




















