ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర రాగి గని ప్రమాదం చోటుచేసుకుంది. లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో సైట్‌లో శనివారం గని వంతెన కూలిపోవడం వల్ల సుమారు 32 మంది కార్మికులు మృతి చెందారు. ఈ వంతెన కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. మైనింగ్ సైట్‌లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. ప్రమాద సమయంలో కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దాంతో అది కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
కాంగోలో రాగి మైనింగ్ స్థానికులకు ప్రధాన ఉపాధి మూలం. కనీసం 15-20 లక్షల మంది దీని ద్వారా జీవనం కొనసాగిస్తున్నారు. భద్రతా చర్యల లోపంతో గతంలో కూడా ఈ గనిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుని, అనేక మంది మృతిచెందారు.




















