పార్టీ మార్పులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా, ఇప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. వచ్చే విచారణకు ముందే స్పీకర్ చర్యలు తీసుకుంటే మంచిదని… లేకపోతే కోర్టు ధిక్కరణ తప్పదని హెచ్చరించారు.
ఇందులో స్పీకర్‌కు రాజ్యాంగ పరిరక్షణ ఉండదని కూడా గుర్తు చేశారు. “కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలో స్పీకర్ గారే నిర్ణయించుకోవాలి” అంటూ గవాయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కేసు విచారణలో, కేటీఆర్ వర్గం తరఫున న్యాయవాదులు—స్పీకర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని, ఇప్పటికే కొంత కేసుల్లో విచారణ పూర్తయ్యాక కూడా తీర్పులు రిజర్వ్ చేసి ఉంచడం సరికాదని వాదించారు. మరోవైపు అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాదులు మాత్రం విచారణ రోజువారీగా జరుగుతోందని చెప్పారు. మధ్యలో వరదల వల్ల ఆలస్యం జరిగిందని వివరించారు.
సుప్రీంకోర్టు మొదట రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించినా, చివరికి స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యర్థన మేరకు నోటీసులకు 4 వారాల గడువు ఇచ్చింది. “ఆ నాలుగు వారాల్లో పని పూర్తి చేయకపోతే, తర్వాత మేం చేయగలిగిన దాంట్లో చాలా తక్కువే ఉంటుంది… గతంలో కూడా స్పీకర్‌లపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి” అని సీజేఐ హెచ్చరించారు.
అంతేకాదు, స్పీకర్ గత ప్రవర్తనే కోర్టును ఇలా వ్యాఖ్యానించేలా చేసిందని కూడా పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు స్పీకర్‌కు వ్యక్తిగత హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు.


















