తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు మరియు 1,13,534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహణకు ఆమోదం ఇచ్చింది, దీనికి పంచాయతీ శాఖ, ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాయి. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కూడా ఈ రోజు జరుగుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సీజీ ధర్మాసనం విచారణ నిర్వహించనుంది. నిజానికి, ఈ విచారణ సోమవారమే జరగాల్సి ఉండగా, మంగళవారానికి వాయిదా పడింది. పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీ శాఖ హైకోర్టుకు నివేదికగా సమర్పించింది. మంగళవారం మంత్రిమండలి సమావేశంలో చర్చించి, తుది గా పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయనుంది. ఇప్పటికే మూడు దశల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించగా, వాటిని ప్రభుత్వం పరిశీలించింది.


















