అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-16సి ఫైటర్ జెట్ దక్షిణ కాలిఫోర్నియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ‘థండర్‌బడ్స్’ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ జెట్ ట్రోనా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఎడారిలో నేలను ఢీకొట్టింది. స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.45 గంటలకు విమానం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో భారీ మంటలు లేచాయి, ఆకాశంలో పొగ వ్యాపించింది.
విమాన కుప్పకూలకముందే పైలట్ పారాచ్యూట్ సహాయంతో బయటకు రాగలిగాడు. స్వల్ప గాయాలతో ఆయనను రిడ్జ్‌క్రెస్ట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ‘థండర్‌బడ్స్’ స్క్వాడ్రన్ కూడా జెట్ కుప్పకూలిన విషయాన్ని ధృవీకరించింది. మొత్తం 6 థండర్‌బడ్స్ జెట్స్‌లో ఒకటి మాత్రమే ప్రమాదానికి గురైందని, మిగతా జెట్లతో సాధారణ శిక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఎఫ్-16 ఫైటర్ జెట్‌లో కేవలం ఒక ఇంజిన్ ఉంది.




















