ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన చట్టం 5(2) సెక్షన్‌లో సవరణ కోసం కేంద్రం కొన్ని రోజుల క్రితం చర్యలు మొదలుపెట్టింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్‌లో చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. ఆ చట్టం ఆమోదం పొందిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేస్తారు.
విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని తెదేపా ప్రభుత్వం ఎంపిక చేసింది. 29 గ్రామాల రైతులు ముందుకు వచ్చి 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా అందించారు. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించి, అసెంబ్లీ, సచివాలయ భవనాలను నిర్మించి పాలన ప్రారంభించారు. పెద్దఎత్తున రహదారులు, ఇతర భవనాల నిర్మాణం కూడా ప్రారంభమయ్యింది. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. ఆ సమయంలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ ప్రాధాన్యం వచ్చింది. రూ.58,000 కోట్లతో పనులు ప్రారంభించి, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవకుండా విభజన చట్టంలో సవరణలు చేయాలన్న హామీ ఇచ్చారు. పార్లమెంట్ ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్ర విభజన చట్టంలోని ముఖ్య విషయాలు:
- 5(1) సెక్షన్: నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది.
- 5(2) సెక్షన్: ఆ పదేళ్ల గడువు ముగిసిన తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రాజధాని ఏర్పడుతుంది.
అమరావతిని రాజధానిగా నోటిఫై చేసే విధానం:
విభజన చట్టంలో 5(2) సెక్షన్‌లో సవరణ చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటిస్తారు.


















