తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగకు తెలంగాణ సోదరసోదరీమణులను ఆహ్వానిస్తూ గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని వారికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని అతిశయోక్తిగా ప్రచారం చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకి ఈక పడినా ఏదో జరిగిందన్నట్లు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం తేలిక అయినా, వ్యవస్థలు నిర్మించడం చాలా కష్టమని చెప్పారు. ఒక కూటమిని నిర్మించి, అందరినీ ఏకతాటిపై నడిపించడం పెద్ద సవాలేనని పేర్కొన్నారు. తాను రాజకీయ లాభాల కోసం కాకుండా వ్యవస్థను బలోపేతం చేసేందుకే వచ్చానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఏం చేశారో వైసీపీ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. పిఠాపురంలో స్కూల్లో పిల్లలు కొట్టుకున్నా పెద్ద వార్తగా మారుతోందని, పిల్లల చిన్న గొడవల్లో కూడా కులాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.



















