చదువులో వెనుకబడ్డామనే భావనతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు అడవిలోకి పారిపోయిన సంఘటన ఆలస్యంగా బయటపడింది. నాలుగు రోజుల పాటు అడవిలో దుంపలు తింటూ, అక్కడి నీటిని తాగుతూ గుహలో దాక్కున్నట్లు తెలిసింది. డ్రోన్ల సహాయంతో పోలీసులు గాలింపు జరిపి, సోమవారం వారిని కనుగొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి చెందిన ఈ బాలికలు, పెదబయలు ఆశ్రమ బాలికల పాఠశాల-1లో ఐదో, ఆరవ తరగతుల్లో చదువుతున్నారు. ఈ నెల 6న పాఠశాల నుంచి కనిపించకుండా పోయారు. 8న పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కొల్లి రమణ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు గాలింపు ప్రారంభించాయి.
సోమవారం డ్రోన్ల సహాయంతో గాలించగా, కొంచూరు కొండల్లోని గుహలో వారు తలదాచుకున్నట్లు గుర్తించారు. వెంటనే గ్రామస్తుల సహకారంతో వారిని రక్షించి, సాయంత్రం తల్లిదండ్రుల వద్దకు అప్పగించారు.


















