ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్: ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక విద్యా సంస్కరణలను చేపట్టింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ (Austrade) ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
సమావేశంలో స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి LEAP (Learning Excellence in Andhra Pradesh) కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ లీప్ కార్యక్రమం విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శకత్వం వహిస్తూ, అంతర్జాతీయ స్థాయి ఉత్తమ బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది.
మంత్రిగారు 21వ శతాబ్దపు నైపుణ్యాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమని, ఆట ఆధారిత పాఠ్యాంశాలు, ఏఐ ఆధారిత బోధనా శిక్షణ, FLN (Foundation Literacy and Numeracy) వంటి వినూత్న కార్యక్రమాలను లీప్‌లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. NEP 2020 లక్ష్యాల మేరకు సవరించిన పాఠ్యాంశాలు, భవిష్యత్ నైపుణ్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల సమగ్ర అభ్యాసానికి మద్దతు ఇస్తాయని చెప్పారు. అన్ని స్థాయిల్లో నైతిక విలువలను పెంపొందించడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెట్టబడ్డాయని లోకేష్ పేర్కొన్నారు.
సమావేశంలో స్టడీ మెల్‌బోర్న్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి ఏటా 170 దేశాల నుంచి 1.75 లక్షలకి పైగా అంతర్జాతీయ విద్యార్థులు విక్టోరియా రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చైనా, భారత్, వియత్నాం, నేపాల్ వంటి దేశాల విద్యార్థులు ఎక్కువగా చేరతారని చెప్పారు. వీరి కారణంగా విక్టోరియా ఆర్థిక వ్యవస్థకు $12.6 బిలియన్ ఆదాయం లభిస్తున్నట్టు తెలిపారు.
విక్టోరియాలో చదువుతో పాటు స్కాలర్‌షిప్‌లు, పని అవకాశాలు, ఆవిష్కరణ, పరిశోధన, సృజనాత్మకతకు ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా అందించబడుతున్నాయి. హైక్వాలిటీ ఎడ్యుకేషన్, కల్చరల్ డైవర్సిటీ, ఉత్సాహభరిత జీవనశైలి మెల్‌బోర్న్ ప్రత్యేకతలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెల్‌బోర్న్ యూనివర్సిటీ, మోనాష్ యూనివర్సిటీ, స్విన్ బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.






















