బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్‌ను క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆయన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ పాపులస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ భేటీలో పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లఘర్, ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ శ్రీమతి ఎలిజబెత్ డిసిల్వా పాల్గొన్నారు. పాపులస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3,500కు పైగా క్రీడా, వినోద ప్రాజెక్టులను పూర్తి చేసి $60 బిలియన్ల విలువైన నిర్మాణ ప్రాజెక్టుల అనుభవాన్ని కలిగి ఉంది.
అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం, యూకేలోని లండన్ ఒలింపిక్ స్టేడియం, కాలిఫోర్నియాలోని సోఫీ స్టేడియం, అట్లాంటా జార్జియాలోని మెర్సిడెస్ బెంజ్ స్టేడియం, న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియం వంటి ప్రపంచ ప్రసిద్ధ క్రీడా వేదికలను పాపులస్ సంస్థే రూపకల్పన చేసింది. ప్రస్తుతం భారత్‌లో ఎల్ అండ్ టీతో కలిసి ప్రధాన మౌలిక సదుపాయ ప్రాజెక్టులపై కూడా పనిచేస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
“ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చడం మా ప్రభుత్వ ప్రాధాన్యత. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణా కేంద్రాల కోసం పాపులస్ సంస్థ ఆధునిక డిజైన్లు అందించాలని కోరుతున్నాం. పర్యావరణ హితమైన, ఎనర్జీ ఎఫీషియంట్ స్పోర్ట్స్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలను ఏపీ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయాలి,” అని అన్నారు.
అలాగే, గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కమ్యూనిటీ స్పోర్ట్స్ కాంప్లెక్సులు, వినోద స్థలాలు, ఇంటిగ్రేటెడ్ ఈవెంట్ స్పేస్‌లు రూపకల్పనలో కూడా సహకారం అందించాలని ఆయన పాపులస్ ప్రతినిధులను కోరారు.
“క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, టూరిజం—అన్ని అంశాలు కలిసిన సమగ్ర పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందేలా ఏపీకి ప్రపంచస్థాయి ప్రణాళిక అవసరం. ఆ దిశగా ఈ భాగస్వామ్యం కీలక మైలురాయిగా నిలుస్తుంది” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

























