గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె వెంకాయమ్మ, మనవరాలు శ్యామలల తరఫున కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి అభ్యర్థనలను కోర్టులు అనుమతించవని మీకు తెలుసుకదా? అని న్యాయమూర్తి పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఒకవేళ పిటిషనర్లు ఒత్తిడి చేసినా, మీరు ఆ వ్యాజ్యం దాఖలు చేయకుండా నిరాకరించాల్సిందని సూచించారు.
న్యాయస్థానాలను ప్రచార వేదికలుగా ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. మానసిక వైకల్యంతో ఉన్న శ్యామల నుంచి పిటిషన్ వివరాలు తెలియకుండా వకలత్‌పై సంతకం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. వ్యాజ్యంలో చేసిన అభ్యర్థనను సవరించాలని న్యాయవాదికి సూచించారు.
అదేవిధంగా, పిటిషనర్లు నివసిస్తున్న ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ జరుగుతోంది? వారి ఇల్లు ఆ ప్రాజెక్ట్‌కు అడ్డుగా ఉందా? వంటి వివరాలను సమర్పించాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కేసు విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే— నిరక్షరాస్యత కారణంగా తమ 5 సెంట్ల స్థలం పొరపాటున సీఆర్డీఏకు అప్పగించామని, దాన్ని తిరిగి ఇవ్వలేకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని శేషగిరమ్మ, ఆమె కుమార్తె వెంకాయమ్మ (ఇటీవల మృతి చెందారు), మనవరాలు శ్యామల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల న్యాయవాది రూపేశ్‌ను రాయపూడిలోని వారి ఇంటికి వెళ్లి పరిస్థితులను పరిశీలించమని ఆదేశించారు. ఆయన వ్యక్తిగతంగా కారు, డ్రైవర్‌ను పంపి ఆ దర్యాప్తు జరిపించారు.
సోమవారం విచారణలో న్యాయవాది రూపేశ్ నివేదికను సమర్పిస్తూ, శ్యామలతో మాట్లాడినట్లు తెలిపారు. ఆమె కొంతవరకు స్పందించగలిగినా, పూర్తిస్థాయిలో మాట్లాడలేకపోతున్నారని వివరించారు.
స్త్రీ, శిశు సంక్షేమశాఖ తరఫున ఏజీపీ పేర్కొంటూ— పిటిషనర్లను ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా, వారు నిరాకరించారని తెలిపారు. సీఆర్డీఏ తరఫు న్యాయవాది వాదిస్తూ— శేషగిరమ్మ భర్త భూసమీకరణలో అరెకరం భూమిని ఇచ్చి, దానికి బదులుగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు పొందారని, వాటిని తరువాత విక్రయించారని చెప్పారు.
పిటిషనర్ల న్యాయవాది బాల వాదిస్తూ— పిటిషనర్లు సంరక్షణ కేంద్రానికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని, వారి అభ్యర్థన మేరకే కారుణ్య మరణానికి అనుమతి అంశాన్ని వ్యాజ్యంలో పొందుపరిచినట్లు తెలిపారు.




















