అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తరగతి గది పాఠాలను ప్రత్యక్ష అనుభవంలో నేర్చుకునేలా ఒక ప్రత్యేక ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, నగరంలోని మధూపుర్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రహదారి పక్కన కూరగాయలు విక్రయించారు. స్వావలంబన, ఆచరణాత్మక జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద పెంచిన పొట్లకాయలు, ఆకుకూరలు, చామగడ్డలు, బొప్పాయి, నిమ్మకాయలు వంటివి స్థానికులకు విక్రయించడం విశేషం. కొంతమంది స్థానికులు వీరి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ కూరగాయలు కొన్నారు. ఉపాధ్యాయుల ప్రకారం, ‘‘విద్యార్థులకు పని, డబ్బు విలువను తెలియజేయడం, స్థానిక మార్కెట్లను అవగాహనలోకి తీసుకోవడం ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యం. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, స్వావలంబన భావాలు పెరుగుతాయి.’’ అస్సాం విద్యాశాఖ మిగతా పాఠశాలల్లో కూడా ఇలాంటి ప్రయోగాలు చేపట్టాలని యోచిస్తోంది.




















