అన్నమయ్య జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మదనపల్లె మండలంలో మంత్ర–తంత్రాల పేరుతో ఓ వ్యక్తి యువకుడి మృతదేహాన్ని పట్టపగలే వెలికితీయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే — మదనపల్లెకు చెందిన 23 ఏళ్ల దిలీప్‌రావు ఈ నెల 1న బెంగళూరులో అనారోగ్యంతో మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు అంకిశెట్టిపల్లె మార్గంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి ఆ శ్మశానానికి వచ్చి, పూడ్చిన మృతదేహాన్ని తవ్వే ప్రయత్నం చేశాడు.
ఈ సమయంలో పశువుల కాపర్లు గమనించి మందలించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గంట తర్వాత తిరిగి వచ్చి మట్టిని తవ్వుతుండగా మృతుడి కుటుంబ సభ్యులు గమనించి అతన్ని పట్టుకుని తీవ్రంగా నిలదీశారు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడగగా, మొదట స్పందించలేదు. తరువాత తన పేరు గోవింద్ అని, జైపూర్ నుంచి వచ్చానని తెలిపాడు. తన చిన్నాన్న మహేష్ ఆత్మతో మాట్లాడేందుకు మంత్రతంత్రాలు చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించానని ఒప్పుకున్నాడు.
వార్త తెలుసుకున్న రూరల్ సీఐ కళా వెంకటరమణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గోవింద్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.



















