వైకాపా అధ్యక్షుడు జగన్ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని కోరుతున్నప్పటికీ, ఆ పార్టీకి అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ అంశంపై ఆయన రాజ్యాంగ నిపుణులు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో చర్చించానని చెప్పారు. నిర్ణీత సంఖ్యకు తగ్గ సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యంకాదని వారు స్పష్టం చేశారని అన్నారు. అందువల్ల వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యంకాదని తేల్చి చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కుతుకులూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం, అనపర్తిలో బీటీరోడ్డును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించిన ఆయన, ‘‘జగన్ బయట మైక్‌లు పట్టుకుని మాట్లాడటం కంటే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి. అక్కడ మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తాం. వైకాపా పాలనలో నన్ను అరెస్ట్ చేశారు. ఆ కారణంగా ఇప్పుడు ‘అధ్యక్షా’ అని పిలవడానికి కూడా జగన్ సంకోచిస్తున్నారు. అసెంబ్లీ ఒక దేవాలయం అయితే, అందులో నేను పూజారి మాత్రమే’’ అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా, వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.




















