కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, హిందూత్వమే తన శ్వాస… ఆ మాట తన నోట నుండి ఆగిపోతే, తన శ్వాస ఆగిపోయినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం హుజూరాబాద్‌లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో, భాజపా తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందూత్వవాదం కారణంగానే 48 సీట్లు గెలిచామని చెప్పారు. మత భేదాలు లేకుండా ప్రధాని మోదీ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ, ముస్లింలు మాత్రం భాజపాకు ఓటు వేయడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వారు ఒకటై భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని, దీనికి ప్రతిగా 80 శాతం హిందూ సమాజం కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
హిందూత్వ నినాదంతో గడప గడపకు వెళ్లి, భవిష్యత్తులో తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ ఫెస్టివల్ బదులుగా “తెలంగాణ డౌన్‌ఫాల్ ఫెస్టివల్” నిర్వహించాలి అంటూ విమర్శించారు.
మావోయిస్టులపై మాట్లాడుతూ, అడవుల్లో మావోయిస్టులు చనిపోతుంటే అర్బన్ నక్సలైట్లు మాత్రం పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన వారి కుటుంబాల బాధలపై అర్బన్ నక్సలైట్లకు చింత లేదని అన్నారు. మార్చి చివరి నాటికి మావోయిస్టుల్ని పూర్తిగా అణచివేసే దిశగా కేంద్రం పనిచేస్తోందని వెల్లడించారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెల 26 నుంచి కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెట్టే సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


















