పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి చేరుకుని, సాయి కుల్వంత్ హాల్‌లోని శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, శతజయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రధాని సందర్శనతో పుట్టపర్తి అంతటా సంబర వాతావరణం నెలకొంది. వేలాది మంది భక్తులు, అనుచరులు ఆలయ ప్రాంగణంలో చేరి స్వామివారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పుట్టపర్తి అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.శతజయంతి సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పుట్టపర్తికి చేరుకుంటున్నారు.
సత్యసాయి సేవా సంస్థలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, అన్నదానాలు నిర్వహిస్తున్నాయి.
ప్రధాని మోదీ తన సందర్శనలో సత్యసాయి బాబా చేసిన సేవా కార్యక్రమాలను స్మరించి, ఆయన చూపిన మార్గం భారత యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.



















