దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ ఆర్ధిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు యూఏఈ మధ్య వాణిజ్య బంధాలను మరింత విస్తరించడానికి, రెండు దేశాల మధ్య సహకార అవకాశాలను చర్చించారు.
భేటీలో ప్రధానంగా భారత్-యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌరసేవల మెరుగుదలపై దృష్టి పెట్టబడింది. సాంకేతికంగా పౌరసేవలలో ఉత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా మార్చిపంచుకునే అంశం కూడా చర్చలో ఉంది.
స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు నిధులు అందిస్తూ, దుబాయ్ సిలికాన్ ఒయాసియా ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే చర్యలపై చర్చ జరిగింది. అలాగే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడానికి అంగీకారం వ్యక్తం చేశారు.
ఆహార భద్రతపై కూడా ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి ఆసక్తి వ్యక్తం చేశారు. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి సమగ్రంగా చర్చించారు.























