అమరావతి, అక్టోబర్ 17: రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గనుల శాఖ, ఉచిత ఇసుక విధానంపై రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని, వాటికి విలువ జోడింపు (Value Addition) ద్వారా అధిక ఆదాయాన్ని సాధించాలన్నారు. ఒడిశా రాష్ట్రం ఉదాహరణగా తీసుకుని, ఏపీలో కూడా విలువ జోడింపు ద్వారా ₹20–30 వేల కోట్ల అదనపు ఆదాయం సాధ్యమని తెలిపారు.
అధికారులు ఈ సమీక్షలో తెలిపిన వివరాల ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ₹3,320 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా గనుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంతో పోలిస్తే 34 శాతం మేర ఆదాయం పెరిగే అవకాశం ఉందని, మాంగనీస్ వంటి ప్రధాన ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతం అదనపు ఆదాయం వస్తోందని వివరించారు.
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపుకు మార్గదర్శకాలు
సీఎం చంద్రబాబు, వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై స్పష్టమైన విధానాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా, వడ్డెర్లు మరియు వారి సంఘాలకు 15% రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు సిద్ధం చేయాలని సూచించారు.
వీరికీ లీజుల కేటాయింపుతో పాటు, సీనరేజ్, ప్రీమియం మొత్తాల్లో 50% రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మైనింగ్ లీజులతోపాటు వీరిని ఎంఎస్ఎంఈ రంగంలోకి తీసుకువచ్చే విధంగా పాలసీని అనుసంధానించాలని ఆయన సూచించారు.
శాటిలైట్, డ్రోన్ టెక్నాలజీతో మైనింగ్ పరిశీలన
గనుల తవ్వకాలను పారదర్శకంగా చేయడానికి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీ వినియోగించాలని సీఎం ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లకు అనుగుణంగా తవ్వకాలు జరిగాయా అనే అంశాన్ని అనలిటిక్స్ ద్వారా రియల్ టైమ్‌లో విశ్లేషించాలి అని చెప్పారు. బీచ్ శాండ్ మినరల్స్ వంటి భార ఖనిజాల్లో విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
కడపలో నిర్మించబోయే స్టీల్ ప్లాంట్‌కు ముడి ఇనుము ఖనిజ సరఫరాపై కూడా సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.
ఉచిత ఇసుక విధానంపై సీఎం ఆదేశాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు పూర్తి ప్రయోజనం అందేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, లోపాలు వాడుకునే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 66.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ, అందులో 43 లక్షల మెట్రిక్ టన్నులు స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు.
సీఎం ఈ సందర్భంగా సూచిస్తూ,
- చిట్టచివరి వ్యక్తికీ ఇసుక అందేలా చూడాలి,
- రవాణా వ్యయం తగ్గించే చర్యలు తీసుకోవాలి,
- అన్ని మార్గాల్లో సీసీ కెమెరా నిఘా మరింత బలోపేతం చేయాలి,
- ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశానికి గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, అలాగే ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు.





















