కానిస్టేబుల్ జయశాంతి గురువారం ఉదయం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అనితతో కలిసి అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా, చిన్నబిడ్డను చంకనెత్తుకొని ట్రాఫిక్‌ను సవ్యంగా నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది.
ఈ విషయం తెలిసిన హోంమంత్రి అనిత రెండు రోజుల క్రితం జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఆ సంభాషణలో మంత్రిని ప్రత్యక్షంగా కలవాలనుకుంటున్నట్లు జయశాంతి పేర్కొన్నారు. దాంతో గురువారం ఆమెను పిలిపించుకున్న మంత్రి, జయశాంతితో కలిసి అల్పాహారం చేసి, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు.


















